দুআ-প্রার্থনা
దుఆ......ప్రార్థన......వేడుకోలు......దుఆ......ప్రార్థన......వేడుకోలు......
దుఆ చేయడం అంటే అర్థించడం, ప్రార్థించడం, వేడుకోవడం, మొరపెట్టుకోవడం, విన్నవించుకోవడం, బ్రతిమాలడం, అనే అర్థాలు వస్తాయి. ప్రతి విషయంలోనూ శక్తి, అధికారం కలిగివున్న ఏ శక్తిస్వరూపుని అధీనంలో మన కష్టసుఖాలు, లాభనష్టాలు ఉన్నాయో ఆ అద్వితీయుడిని మాత్రమే వేడుకోవడం, మొరపెట్టుకోవడం జరగాలి. ఏకైక ఆరాధ్యుడే (అల్లాహ్ యే) ఆ అద్వితీయుడు సర్వసృష్టికర్త, విశ్వప్రభువు, నిజమైన యజమాని. ఆయనే మన ఆపద్బాంధవుడు. ఆపదల మొక్కులవాడు. కనుక మానవులు తమ వేడుకోళ్ళను, ప్రార్థనలను, మొరలను, విన్నపాలను ఆ ఏకైక ఆరాధ్యుడికే అర్పించాలి. ఖుర్ఆన్ లోని ఈ వచనాలను చదవండి. - “నీవు ఏకాగ్రచిత్తుడవై ఈ ధర్మంలో స్థిరంగా ఉండు. బహుదైవారాధకుల్లో చేరిపోకు. అల్లాహ్ ను వదిలి నీకు ఎలాంటి లాభం గాని, నష్టంగాని కలిగించని మిధ్యాదైవాలను ఎన్నటికీ ఆరాధించకు. అలా చేస్తే నీవు దుర్మార్గుడవై పోతావు. దైవం నిన్ను ఏదైనా కష్టానికి గురి చేయదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ ఆ కష్టం నుండి నిన్ను గట్టెంక్కించలేరు.” దివ్యఖుర్ఆన్ 10:105-106
దుఆ (ప్రార్థన) షరతులు:-
1.(ప్రవక్తా!) నా దాసులు నా గురించి అడిగితే నేను వారికి చేరువలోనే ఉన్నానని చెప్పు. మొరపెట్టుకునేవాడు నన్ను మొరపెట్టుకుంటున్నప్పుడు నేనతని మొరాలకించి, దానికి సమాధానం ఇస్తానని కూడా తెలియజెయ్యి. అయితే వారు నా సందేశం స్వీకరించి నాపట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు వారు సన్మార్గం పొందగలరు. (దివ్యఖుర్ఆన్ 2:186)
2.‘కొందరు సృష్టికర్తను ప్రార్థిస్తూ “ఓ అల్లాహ్! మాకు (నీవు ప్రసాదించేవన్నీ) ప్రపంచంలోనే ప్రసాదించు” అంటారు. అలాంటివారికి (ప్రపంచంలోనే తప్ప) పరలోకం లో ఎలాంటి భాగం లభించదు.’ (దివ్యఖుర్ఆన్ 2:199-200)
3.‘మీ సృష్టికర్త చెబుతున్నాడు:”నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థన స్వీకరిస్తాను. అహంకారంతో నన్ను ఆరాధించటానికి అంగీకరించనివారు నీచులయి నరకానికి పోతారు”’ దివ్యఖుర్ఆన్ (40:60)
వివరణ:- కష్టసుఖాలు, లాభనష్టాలు, కీడుమేళ్ళు అన్నీ సృష్టికర్త, విశ్వపాలకుడు అయిన అల్లాహ్ అధీనంలో మాత్రమే ఉన్నాయి. ఆయనే అసాధారణ శక్తిసంపన్నుడు.ఆయన తన దాసుల మొరలను ఎలాంటి మధ్యవర్తుల సహాయం లేకుండానే ప్రత్యక్షంగా వింటాడు. తాను తలచుకున్నవారికి సహాయం కూడా చేస్తాడు. కనుక మానవులు ఆయన్నే వేడుకోవాలి.
ఈ కార్యకారణ ప్రపంచంలోని సహజ వనరులు, సాధన సంపత్తులేవీ ఒక్కోసారి దాసుల కష్టాలను దూరం చెయ్యలేవు, వారి అవసరాలు తీర్చలేవు. అప్పుడు దాసుడు అసాధారణ శక్తిసంపన్నుడైన సర్వలోక సృష్టికర్తను మొరపెట్టుకుంటారు. అతడే ఆ అసాధారణ శక్తిసంపన్నుడు, సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడు (అల్లాహ్) అని గుర్తించాలి. ఆయన్ను వదిలి సృష్టితాలను వేడుకునే వారు ప్రపంచంలో తాత్కాలిక ప్రయోజనం పొందగలిగినా, ఘోరపాపానికి (షిర్క్) కు పాల్పడుతున్నవారవుతారు. నిజమైన విశ్వాసం కలిగిన ముస్లింలు కేవలం ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త (అల్లాహ్)నే వేడుకుంటారు. అయితే మొర పెట్టుకునే, అర్థించే, ప్రార్థించే, వేడుకునే, దుఆచేసే వారు తమ భౌతిక ప్రయత్నాలతో పాటు ఈ క్రింది విషయాలు కూడా గమనించాలి.
1) ఒక ముస్లిం పాపకార్యానికి లేదా బంధువుల పట్ల నిర్దయకు సంబంధించిన విషయంలో గాకుండా, మరేదైనా విషయంలో దుఆ చేసినప్పుడు, సృష్టికర్త అతడి ప్రార్థన (దుఆ) కు మూడింటిలో ఏదో ఒక రూపంలో ప్రతిస్పందిస్తాడు, అతడి దుఆను - ఈ ప్రపంచంలోనే పూర్తిచేస్తాడు, లేదా అతడికి పరలోకంలో ప్రతిఫలం ఇవ్వడానికి దాన్ని భద్రపరుస్తాడు లేదా ఆ దుఆలోని, విషయానికి సమాన స్థాయి గల ఏదైనా ఆపదను అతడి మీద పడకుండా నిరోధిస్తాడు. అహ్మద్ హదీథ్ గ్రంథం
2) తన ప్రార్థనను సృష్టికర్త తప్పకుండా స్వీకరిస్తాడని గట్టి నమ్మకం ఉంచాలి. తిర్మిథి హదీథ్ గ్రంథం.
3) మనిషి తొందరపాటుతో ‘నేను ఎంతగానో వేడుకున్నాను, చాలా సార్లు వేడుకున్నాను. కాని నా వేడుకోలు స్వీకరించబడే సూచనలు కనబడటం లేదు’ అని చెప్పి, అలసిపోయి వేడుకోవడం మానేస్తాడు. అలాంటి తొందరపాటు పనికిరాదు. ముస్లిం హదీథ్ గ్రంథం.
4) మీలో ప్రతి వ్యక్తీ తన అవసరాల కోసం సృష్టకర్తను వేడుకోవాలి. చివరికి తన చెప్పు దారం తెగిపోయినా, (దానికోసం కూడా) సృష్టికర్తనే వేడుకోవాలి. తిర్మిథి హదీథ్ గ్రంథం.
5) ఒకతను సుదూర ప్రయాణం చేసి దుమ్ము కొట్టుకుని వస్తాడు. అతడు ఆకాశం వైపు చేతులెత్తి “ఓ అల్లాహ్! ఓ అల్లాహ్!” అంటూ ప్రార్థిస్తాడు. కాని అతడు తింటున్నది అధర్మమైన తిండి, అతడు తొడుక్కున్నది అధర్మ సంపాదనతో కొనుక్కున్న దుస్తులు, అతడి శరీరం అక్రమ సంపాదనతో పోషించబడినది - మరి అలాంటప్పుడు అతడి ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది? ముస్లిం హదీథ్ గ్రంథం.